శ్రీకృష్ణ ఉద్దవుడి సంభాషణ 2



ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను, విను. కనకావతీనగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండిపెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే, ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని, ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి, చప్పుడు కాకుండా తన పని పూర్తిచేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులై మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా, సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్ళు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను. “దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము.” అని అడిగాడు

అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు.

అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.” అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.

పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.

“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.

ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు. కమలలోచనా! చతుర్వర్ణములు చతురాశ్రమములు వాటి ధర్మములు నిర్ణయించి చెవులకింపు అయ్యేలా చెప్పు వింటాను.” ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక; నాలుగు ఆశ్రమాలకూ తగిన పద్ధతులు; నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలు; ప్రవృత్తి నివృత్తి హేతువులయిన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు; వైరాగ్య విజ్ఞానములు; మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమయిన గీతాప్రవచనం ప్రకారం. నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు అతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా, నామీదనే తలపు కలిగి నడచుకో. అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు. శ్రీకృష్ణా! తెలియనివి కొన్ని చెప్పావు. ఇంకా తెలియవలసినవి ఏవైనా ఉంటే తెలుపు. వాటిని తెలుసుకుని కృతార్ధుడను అవుతాను.” ఇలా ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఉద్ధవా! నీ ప్రశ్నలు సామాన్య మైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలూ శమదమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుఃఖాలు స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరు డంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను.

మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిధులను సత్కరించుట, పరహితము, దొంగతనమూ మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం శమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్సనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. శమదమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం, అవిద్య అంటారు, చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి, నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుఃఖము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు.

నా మీద మనసును నిలిపి కర్మయోగమందు, భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్ళు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక, ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లుపడితే నీళ్ళు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గరపడుతు ఉంటుంది. కాబట్టి, ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు, నాకు ప్రియుడు. ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది. అందుచేత, మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగ కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటిబావిలో పడతాడు. అటువంటివాడిని దరిద్రునిగా చేస్తే, జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని, ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్ళుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు. స్వామీ! దేవదేవా! వాసుదేవా! జనార్ధనా! నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది. అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “ఆవిధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక అండంగా ఏర్పడ్డాయి; ఆ అండం నుంచి నేను పుట్టాను; అంతట నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచ మంతా అతని చేత నేనే నిర్మింప చేసాను. ఆ బ్రహ్మదేవుడికి నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది; గంధం నీటిలో కలుస్తుంది; ఆ నీరు రసములో లీనమవుతుంది; ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది; ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది; ఆ రూపం వాయువులో కలుస్తుంది; ఆ వాయువు స్పర్శగా మారుతుంది; ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది; ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగొనబడుతుంది; ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి.

భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పాడు. మళ్ళీ ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము. ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నేను అన్ని వర్ణాలవారు అనుసరించ తగ్గ పూజా పద్ధతి చెప్తాను, విను. రాతితో కాని, మట్టితో కానీ, కొయ్యతో కానీ తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరుపెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రతిమలు శ్రేష్ఠమైనవి. ఈవిధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి, నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక, ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనై ఉంటాను. కాబట్టి, క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి; శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపూతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్ధాలను సమర్పించి కానీ; లేదా ప్రతిదినము మానసిక పూజాపద్దతులతో కాని సంతుష్టి పరచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు పూలదండలు ధరించి ప్రకాశిస్తూ; శంఖము, చక్రము, కిరీటము, మొదలైన వానితో అలంకృతుడనైన మంగళవిగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నా యందు కలుస్తాడు. ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు.” అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగిపొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తునకు చెప్పాడు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...